హైదరాబాద్( సహా న్యూస్)
శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో భయాందోళన వాతావరణం నెలకొంది. విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడు చెప్పిన మాటలకు సిబ్బంది పరుగులు పెట్టారు..
ఉదయం హైదరాబాద్ నుంచి బ్యాంకాక్‌కు వెళ్లాల్సిన విమానం గేటు వద్దకు వచ్చింది. దీంతో ఓ ప్రయాణికుడు తన వద్ద బాంబు ఉందని హల్ చల్ చేశాడు. ప్రయాణికుడి మాటలకు అప్రమత్తమైన సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది అతన్ని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారిస్తున్నారు. అతని వద్ద ఉన్న లగేజ్ ని పరిశీలిస్తున్నారు. అయితే ఇదంతా ఘటన జరినప్పుడు విమానంలో సుమారు 136 మంది ప్రయాణికులు ఉన్నారు. దీంతో విమానాన్ని ఐసోలేషన్ ప్రాంతానికి తీసుకెళ్లి తనిఖీలు చేస్తున్నారు..
దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కాసేపు ఏం జరుగుతుందో వారికి అర్థంకాలేదు. ఎందుకు తనిఖీలు నిర్వహిస్తున్నారని ఓ ప్రయాణికుడు అడగగా .. భయపడాల్సిన పనిలేదని, బాంబు ఉందనే సమాచారంతో తనిఖీలు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా.. అందరిని విమానం నుంచి కిందికిదించారు. మరోవైపు గత కొద్దిరోజులుగా పదుల సంఖ్యలో విమానాలకు బూటకపు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది..